పవన్ టైటిల్ ‘లాయర్ సాబ్’ ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ ఖాయమైంది. ‘పింక్’ రిమేక్ లో పవన్ నటించబోతున్నారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన శనివారం వచ్చేసింది. దీంతో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు. పవన్ మళ్లీ తెరపై చూడాలన్న కోరిక తీరబోతుందనే ఆనందంలో మెగా అభిమానులున్నారు. దాంతో పాటు పవన్ ‘పింక్’ సినిమా గురించి మరిన్ని విషయాలు ఆరా తీసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు తెలిసినట్టు సమాచారమ్.

బిగ్ బీ అమితాబ్, తాప్సీ ముఖ్య పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం ‘పింక్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రానికి అనిరుధ్ రాయ్ చౌదరి దర్శకత్వం వహించారు. ఇందులో లాయర్ పాత్రలో అమితాబ్ అదరగొట్టాడు. ఈ సినిమాని అజిత్ హీరోగా బోనీకపూర్ రిమేక్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రిమేక్ ని పవన్ కల్యాణ్ చేయనున్నారు. పవన్ కంటే ముందు ఈ సినిమా బాలయ్య దగ్గరకి వెళ్లింది. దిల్ రాజు ఈ కథని బాలయ్యతో చేద్దామని ప్రయత్నించారు. ఆ సమయంలోనే ‘లాయర్ సాబ్’ టైటిల్ వినిపించింది.

ప్రస్తుతం బాలయ్య ‘రూలర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత బోయపాటి సినిమా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పింక్ రిమేక్ చేస్తాను. కానీ, కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందిగా కోరారట. అదేసమయంలో పవన్ తో పింక్ రిమేక్ పై చర్చలు ఫలించాయ్. దీంతో పవన్ ప్రధాన పాత్రలో తెలుగు పింక్ తెరకెక్కనుంది. ఐతే, తెలుగు పింక్ కోసం ‘లాయర్ సాబ్’ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా ? లేదంటే మరో పవర్ ఫుల్ టైటిల్ ని వెతుకుతారా ? అన్నది చూడాలి.