ప్రభుత్వానికి హెచ్చరిక : ఎన్ని డెడ్ లైన్స్ పెట్టినా సమ్మె ఆగదు

ఆర్టీసీ సమ్మె విషయంలో అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ జేఏసీ ఎవ్వరు తగ్గడం లేదు. కార్మికులు తిరిగి విధుల్లో చేరేందుకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఇవాళ (నవంబర్5) అర్థరాత్రి వరకు ఆర్మికులు విధులు చేరాలని, లేకపోతే వారి ఉద్యోగాలు పోయినట్టే. అసలు ఆర్టీసీనే ఉండదు. ఆర్టీసీ లేని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరుతుందని హెచ్చరించారు.

సీఎం కేసీఆర్ హెచ్చరికని ఆర్టీసీ జేఏసీ సీరియస్ గా తీసుకోలేదు. కార్మికులెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. చర్చలకు పిలవకుండా కార్మికులను భయపెట్టేలా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని డెడ్‌లైన్లు పెట్టినా సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో అఖిలపక్ష నాయకులతో జేఏసీ నేతల సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడారు. ఆర్టీసీలో కేంద్రానికి 30 శాతం వాటా ఉంటుందని, కార్పొరేషన్‌ను మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.