టాలీవుడ్ స్టార్స్ ఫిట్ నెస్ ట్రైనర్ అరెస్ట్ !

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఫిట్ నెస్ ట్రైనర్ రిజ్వాన్ సయ్యద్‌ ఓ చీటింగ్ కేసులో అరెస్టయ్యారు. రిజ్వాన్ యూత్ ఫిట్‌ నెస్ క్లబ్ యజమాని కూడా. ఆయన్ని ఓ చీటింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో పలు ఫిట్ నెస్ శాఖలను ప్రారంభించిన సయ్యద్, వందలాది మందికి సభ్యత్వం ఇచ్చి, వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు.ఆపై వాటిల్లో చాలావరకూ మూసివేయడంతో, తమకు ముందుగా సమాచారం ఇవ్వకుండా జిమ్ సెంటర్లను మూసివేశారని, తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పోలీసులకి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రిజ్వాన్ ని అరెస్ట్ చేశారు. వార్షిక సభ్యత్వ రుసుము పేరిట ఒక్కొక్కరి నుంచి రూ. 20 వేల వరకూ వసూలు చేశాడట. ఇలా దాదాపు 50 మంది బాధితులు, మొత్తం ఆరు లక్షలకు పైగా నష్టపోయామని ఫిర్యాదు చేశారు. దీంతో కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు, సయ్యద్ ను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అనుమతితో ఈ నెల 6 వరకూ సయ్యద్ ను ప్రశ్నించనున్నామని అధికారులు వెల్లడించారు.