రేవంత్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఎందుకు? నిలదీసిన వీహెచ్ !

కాంగ్రెస్ లో కాలులాగే నేతలే ఎక్కువ. ఇందులో సిద్ధహస్తుడు సీనియర్ నేత వి. హనుమంతరావు. ఆయనిప్పుడు పార్టీలో సీనియర్లకి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం గాంధీభవన్ లో గులాం నబీ ఆజాద్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం పూర్తయిన తర్వాత వీహెచ్ ఆజాద్ వద్దకు వెళ్లారు. వేరే పార్టీ నుంచి వచ్చిన ఎంపీ రేవంత్ రెడ్డికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారని.. ప్రతి అంశంలో షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డికి తోడ్పాటుగా నిలుస్తున్నారంటూ వీహెచ్ ఫిర్యాదు చేశారు. పార్టీలో అసలైన సీనియర్లకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న షబ్బీర్ అలీ జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త మీడియా కంటపడింది. ఇకేముంది.. ? తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి బయటపడిన లుకలుకలు న్యూస్ వైరల్ అవుతోంది.

వాస్తవానికి ఇటీవలే రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పదవి ఖాయమైందనే వార్తలొచ్చాయ్. ఇది తెలిసిన సీనియర్ నేతలు ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారని అధిష్టానాన్ని నిలదీసినట్టు వార్తలొచ్చాయ్. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం వాయిదా పడిందనే ప్రచారం జరిగింది. అధిష్టానానికి ఫిర్యాదు చేసిన నేతల్లో వీహెచ్ పేరు బలంగా వినిపించింది. వీహెచ్ తీరు చూస్తుంటే.. ఈ వయసులోను ఆయనకి పీసీసీ పదవిపై పెద్ద ఆశలే ఉన్నట్టున్నాయ్… !