ఆర్టీసీపై ప్రభుత్వ లెక్కలు తప్పాయ్.. హైకోర్టు చివాట్లు మిగిలాయ్ !

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు ఇప్పట్లో పులిస్టాప్ పడేలా కనిపించడం లేదు. కార్మికులు తిరిగి విధుల్లో చేరండని స్వయంగా సీఎం కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ (నవంబర్ 5) ముగిసింది. ఆ డెడ్  లైన్ ని ఆర్టీసీ కార్మికులు ఖాతరు చేయలేదు. కేవలం 360మంది కార్మికులు మాత్రమే తిరిగి విధుల్లో చేరారు. వీరిలో సగం మంది మరో నెలరోజుల్లో పదవి విరమణ చేసేవాళ్లు, హైదరాబాద్ బస్ భవన్ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందే చెప్పినట్టు ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటు పరం చేసే దిశగా సీఎం కేసీఆర్ సీరియస్ గా దృష్టి సారించారు. బుధవారం ఆర్టీసీపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.

మరోవైపు, ఆర్టీసీని ప్రయివేటు పరం చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. దానికి కచ్చితంగా కేంద్రం అనుమతిని తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెబుతున్నారు. వారికి సపూర్ణ మద్దతునిస్తున్న తెలంగాణ బీజేపీ కూడా ఇదే మాట చెబుతోంది. తెలంగాణ ఆర్టీసీలో కేంద్రం వాట 31 శాతం. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొన్న కేంద్రాన్ని సంప్రదించాల్సిందే. కేంద్రం కార్మికులని అన్యాయం చేయకుండా చూసుకొనే బాధ్యత మాదని భరోసా ఇస్తున్నారు. అంతేకాదు.. ఆర్టీసీని కేంద్రం టేకప్ చేయాలనే ఆలోచనలో ఉందని కార్మికులకి కొత్త ఆశలు రేకిత్తిస్తున్నారు తెలంగాణ భాజాపా అధ్యక్షుడు లక్ష్మణ్. 

ఇక ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో సీరియస్ గా విచారణ సాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఈ రోజు విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఇన్ ఛార్జి ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు.
ప్రభుత్వ అధికారులు సమర్పించిన లెక్కలపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఓ ఐఏఎస్ స్థాయి అధికారులు ఈ విధంగా కోర్టుకు అసంపూర్ణంగా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారని పేర్కొంది. తాజా హైకోర్టు చివాట్లతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగిందని చెప్పవచ్చు.