రవితేజ సినిమాలో ‘ఆర్ఆర్ఆర్’ నటుడు

తమిళ నటుడు స‌ముద్ర‌ఖ‌ని తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడే. ప్రస్తుతం ఆయన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అందుకే ఆయన్ని ‘ఆర్ఆర్ఆర్’ నటుడు అంటున్నారు. తాజాగా సముద్రఖని మరో తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. రవితేజ66 వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ ని హీరోయిన్ గా తీసుకొన్నారు. ఓ కీలక పాత్ర కోసం సముద్రఖనిని తీసుకొన్నట్టు తెలుస్తోంది. 

డాన్‌శీను, బ‌లుపు సినిమాల తర్వాత రవితేజ-గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతోన్న చిత్రమిది. లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తవ్వగానే గోపీచంద్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.