ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష.. ఈసారి ఏం తేలుస్తారో ?
ఆర్టీసీ విషయంలో దూకుడుగా వెళ్తాదమనుకొన్న సీఎం కేసీఆర్ కు హైకోర్టు బ్రేకులు వేసింది. 5,100 ప్రైవేట్ బస్సులకు రవాణా అనుమతుల విషయంలోనూ ముందుకెళ్లరాదని న్యాయ స్థానం సూచించింది. ఇదీగాక.. కార్మికులు మెట్టుదిగకుంటే ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటు పరం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా చర్యలకి సవాలక్ష న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. దీనికితోడు ఆర్టీసీ లెక్కల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు పెద్ద తలనొప్పిగా మారాయి.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై మరోమారు సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్ లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్ ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్న హైకోర్టు సూచన నేపథ్యంలో తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకొంటారా ? గతంలో సీఎం కేసీఆర్ చెప్పినట్టు.. సుప్రీం కోర్టుకు వెళ్తారా ?? అన్నది చూడాలి.