కాంగ్రెస్ కలెక్టరేట్ల ముట్టడికి.. అడ్దంకులు, అరెస్టులు !

తెలంగాణ కాంగ్రెస్ నిరసనబాట పట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని గాంధీభవన్ నుంచి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ప్రదర్శనగా బయల్దేరారు. అనంతరం గవర్నర్ తమిళిసైను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఐతే, కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫైనల్ గా కాంగ్రెస్ ప్రముఖులు కొందరు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, సీనియర్‌ నాయకులు అంజన్‌కుమార్‌ యాదవ్, జనారెడ్డి తదితరులు గవర్నర్ ని కలిసిన వారిలో ఉన్నారు. మరోవైపు, అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగాయి.