సేనకు హ్యాండిచ్చారు !

మహారాష్ట్ర రాజకీయాలు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయ్. భాజాపా మద్దతు లేకుండా ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంకా చెప్పాలంటే.. ఆఖరి క్షణంలో హస్తం పార్టీ హ్యాండిచ్చింది.

288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 105 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా.. సర్కారును ఏర్పాటు చేయలేమని గవర్నర్ కు చెప్పడంతో శివసేనకు ఆహ్వానం అందింది. దీంతో శివసేన ఎన్ సీపీ, కాంగ్రెస్ ల మద్దతును కోరింది. ఎన్ సీపీ, కాంగ్రెస్ కు కలిపి 98 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం. మూడు పార్టీలు కలిస్తే 154 మంది ఎమ్మెల్యేల మద్దతు సమకూరినట్లవుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం మూడు పార్టీల మధ్య జోరుగా సమావేశాలు, ఫోన్ సంభాషణలు జరిగాయి.

ఐతే శివసేనకు గవర్నర్ ఇచ్చిన గడువు (సోమవారం రాత్రి 7:30ని॥) ముగియడానికి కొద్దిసేపటి ముందు.. మహారాష్ట్రలో పరిస్థితులపై ఎన్ సీపీతో మరిన్ని చర్చలు జరపాల్సి ఉందంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటనతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు తమకి మరో మూడ్రోజుల సమయం కావాలని శివసేన గడువును కోరగా.. దానికి గవర్నర్ తిరస్కరించారు. అనంతరం గవర్నర్ నుంచి ఎన్సీపీకి పిలుపు వెళ్లింది.