పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన హీరో రాజశేఖర్
సీనియర్ హీరో రాజశేఖర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. శంషాబాద్ దగ్గరున్న పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుకు వచ్చిన వెంటనే రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు టైర్ పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. కారు డ్యామేజ్ అయిన తీరు చూస్తుంటే లోపల ఉన్నవాళ్ల్లు చనిపోయే ఉంటారు అనుకొనే రీతిలో ఉంది. ఐతే, సకాలంలో కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఇటీవల యంగ్ హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదం జరిగిన సమీపంలోనే తాజా రాజశేఖర్ కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై రాజశేఖర్ స్పందించారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ప్రమాదం గురించి రాజశేఖర్ మాట్లాడుతూ.. “మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు” అని తెలిపారు.