హాస్పటల్ కి చేరుకొన్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న, సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన గత కొంతకాలంగా నిమోనియాతో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి అది తీవ్రమవ్వడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వెంటెలేటర్స్ పై చికిత్స పొందుతున్నారు.

పెదనాన్న హాస్పటల్ లో చేరాడన్న విషయం తెలుసుకొన్న ప్రభాస్ హుఠాహుటిన హాస్పటిల్ కి వచ్చారు. పెదనాన్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లని అడిగి తెలుసుకొన్నట్టు తెలుస్తోంది. కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్ సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న జాన్ సినిమా షూటింగ్ హైదారాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. పెదనాన్న ఆసుపత్రిలో చేరాడన్న విషయం తెలుసుకొన్న ప్రభాస్ షూటింగ్ మధ్యలోంచి వచ్చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు, కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కేర్ వైద్యులు తెలిపారు.