వేధింపులకు భయపడి పార్టీలు మారకూడదు

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మీడియా ముందుకు వస్తే సంచలనమే. తాజాగా జేసీ మీడియా ముందుకు వచ్చారు. ఐతే, ఈసారి చాలా సింపుల్ గా తన స్పందనని తెలియజేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం తెదేపా అధినేత చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కనీసం ప్రతిపక్ష నాయకుడి పాత్రని కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు. 

దాంతో పాటు తెదేపాలో జూ. ఎన్ టీఆర్ ఎక్కడ ? అంటూ ప్రశ్నించారు. 2009లో ఎన్ టీఆర్ తెదేపా కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత పార్టీలో కనిపించలేదు. ఎందుకు ? అంటూ సూటిగా ప్రశ్నించారు వంశీ. ఆ కామెంట్స్ కి రియాక్షన్ అంటూ ఈరోజు వంశీని తెదేపా నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాదు.. చంద్రబాబుపై వంశీ చేసిన కామెంట్స్ కి తెదేపా నేతలు వరుసపెట్టి కౌంటర్ ఇస్తున్నారు. జేసీ కూడా రంగంలోకి దిగారు. పార్టీ మారే వారు అధినేతను ఏదో ఒకటి అనాలి కదా ? అందుకే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అన్నారు జేసీ. కొన్ని నెలల క్రితం సుజనా చౌదరి కూడా చంద్రబాబుపై విమర్శలు చేశారని గుర్తుచేశారు.

అదే సమయంలో జేసీ తన బాధని కూడా చెప్పుకొన్నారు. తనకి చెందిన బస్సులని సీజ్ చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ పెద్దల వలన జరుగుతుందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో ప్రతీకార కోరిక ఎక్కువైంది. శాశ్వతం కాదని గుర్తించాలన్నారు జేసీ. అంతేకాదు.. వేధింపులు ఎక్కువయ్యాయి.. కొన్నాళ్లు తాను బిజినెస్ చేయడం మానేయాలని అనుకుంటున్నానన్నారు జేసీ.