సుప్రీంకోర్టు సీజేగా ఎస్ఏ బొబ్డే ప్రమాణం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అర్వింద్ బొబ్డే ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ ఎస్ఏ బొబ్డే.. 2021, ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నారు. జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే (63) మహారాష్ర్టకు చెందిన వ్యక్తి. 19 ఏండ్ల క్రితం అదనపు న్యాయమూర్తిగా బాంబే హైకోర్టులో చేరిన జస్టిస్ బోబ్డే.. ఆ తర్వాత రెండేండ్లకు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
దేశంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ బోబ్డే పదవీకాలం 18 నెలల్లో ముగియనున్నది. జస్టిస్ బోబ్డే తన కెరీర్లో విచారణ జరిపిన కీలక కేసుల్లో అయోధ్య కేసుతోపాటు ఆధార్ ఆర్డినెన్స్ కేసు, పౌరుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కేసు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూస్) రిజర్వేషన్ కేసు, ఆర్టికల్ 370 కేసు ముఖ్యమైనవి. ఇక రాష్ట్రపతి భవన్లో జరిగిన బొబ్డే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.