ఆర్టీసీ కార్మికులకి కేంద్రమే దిక్కు !

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ముగిసింది. బేషరతుగా తిరిగి విధుల్లోకి చేరేందుకు కార్మికులు అంగీకరించారు. ఐతే, ఇక్కడ ఒకటే తిరకాసు.. విధుల్లో చేరే ముందే ప్రభుత్వం ఎలాంటి పత్రాలపై సంతకాలు తీసుకోవద్దని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించేలా లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు పోతాయేమో అనే భయంలో కార్మికులు ఉన్నారు. 

భాజాపా నేతలు మాత్రం ఆర్టీసీ కార్మికులకి ధైర్యాన్ని ఇస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని ఆయన అన్నారు. కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగకుండా.. షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్రం చొరవ తీఎసుకోవాలని, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశామన్నారు.

మరీ.. కేంద్రం చెబితే రాష్ట్ర ప్రభుత్వం వింటుందా ? అంటే.. ఏపీ ఆర్టీసీ ఇంకా విలీనం జరగలేదు. అదీగాక.. ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉందని భాజాపా నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులని తిరిగి విధుల్లోకి చేర్చే పూచి మాది అంటున్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ కూడా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సానుకూలంగా స్పందించారట. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, అధికారులను ఢిల్లీకి పిలిపించి మాట్లాడతా అన్నారని తెలుస్తొంది.