మెగాస్టార్ దర్శకుడికి పూరి సాయం !

మెగాస్టార్‌ చిరంజీవి తొలి సినిమా ‘పునాదిరాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్ కుమార్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చూపించుకొనే స్థోమత కూడా ఆయనకి లేదు. ఈ నేపథ్యంలో ఆయన్ని మెగాస్టార్ చిరంజీవి ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ విజ్ఝప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి మెగాస్టార్ స్పందించలేదు. కానీ, దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందించినట్టు తెలుస్తోంది. రాజ్ కుమార్ ని ఆదుకోవడానికి పూరి ముందుకొచ్చాడు.

బుధవారం పూరి రూ.50 వేల రూపాయలని రాజ్ కుమార్  పంపించారు. ఆయనతో పాటు మెహర్‌ రమేష్‌ రూ.10 వేలు, కాశీవిశ్వనాథ్‌ రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు. వారి స్పందనకు రాజ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి తొలి సినిమా పునాది రాళ్లకి రాజ్ కుమార్ దర్శకుడు మాత్రమే కాదు. నిర్మాత కూడా ఆయనే. కథ-మాటలు అన్నీ తానే సినిమాని రూపొందించారు.

ఒక్కమాటలో చెప్పాలంతే.. ఆర్థిక కష్టాలకోర్చి పునాది రాళ్లు సినిమాని చేశారు. చిరంజీవి మెగాస్టార్ గా మారడానికి గట్టి పునాది వేశారు. ఇక వరుస ప్లాపుల్లో సతమతమయిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ హిట్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ యేడాది ఆయన పుట్టినరోజు నాడు గొప్ప నిర్ణయం తీసుకొన్నారు. దర్శకులుగా ఎదగాలని ప్రయత్నించి.. విఫలమైన కొంతమందికి పూరి ఆర్థిక సాయం చేశారు. దేవుడు చల్లగా చూస్తే ప్రతి యేడాది ఇలాగే సాయం చేస్తానని వెల్లడించారు. ఇప్పుడు మెగాస్టార్ దర్శకుడు రాజ్ కుమార్ ని గొప్ప మనసుతో ఆదుకొన్నారు. పూరికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.