మహా సీఎం ఫడ్నవీసే.. !

మహారాష్ట్రలో రాజకీయాలు రాత్రికి రాత్రే మారిపోయాయి. శివసేన, కాంగ్రెస్ -ఎన్సీపీ కూటమి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని అనుకుంటున్న వేళ.. భాజపాతో కలిసి ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరికొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సభలో బల నిరూపణకు గవర్నర్ వారం రోజులు గడువు ఇచ్చారు. శివసేన-ఎన్సీపీ పొత్తును విమర్శించిన బీజేపీ తెల్లారేసికి ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం విశేషం.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఫడ్నవీస్ 1970 జులై 22వ తేదీన నాగ్ పూర్‌లో జన్మించారు. నాగర్ పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటి మున్సిపల్ ఎన్నికల్లో రామ్ నగర్ వార్డు నుంచి గెలుపొందారు. ఐదు సంవత్సరాల తర్వాత నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అతి చిన్న వయస్సులో మేయర్ అయ్యారు. 1999 నుంచి మహారాష్ట్ర శాసనసభకు అడుగు పెట్టారు. నాగ్ పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారాయన. రాష్ట్ర అసెంబ్లీలో అనేక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. 2014లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అమృత ఫడ్నవీస్‌తో వివాహమైంది. దివ్య ఫడ్నవీస్ కూతురు ఉంది.