ఆర్టీసీ కార్మికులకి మళ్లీ నిరాశే.. !
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకి మళ్లీ చిక్కెదురైంది. సమ్మె విమరమించి.. తిరిగి విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులకి నిరాశఎదురైంది. వారిని డిపో మేనేజర్లు విధుల్లోకి చేర్చుకోవడం లేదు. తమకి అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని చెబుతున్నారు. అంతేకాదు.. విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులని పోలీసుల సాయంతో అక్కడి నుంచి పంపిస్తున్నారు. మాట వినని వారిని అరెస్ట్ కూడా చేస్తున్నారు. కొన్ని డిపోల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు.
మరోవైపు, ఏ ఒక్క కార్మికుడ్ని కూడా తిరిగి విధుల్లోకి చేర్చుకోబోమని ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ తేల్చి చెప్పారు. లేబర్ కోర్టు నిర్ణయం తీసుకొనే వరకు సంయమనం పాటించాలని సూచించారు. సమ్మె విరమిస్తున్నాం అనడం ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం హాస్యాస్పదమని అభివర్ణించారు. ఇష్టం వచ్చినప్పుడు విధులకు.. గైర్హాజర్ అవడం, ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరుతామనడం ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండదన్నారు. అన్ని డిపోల దగ్గ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఆర్టీసీ యాజమాన్యం క్షమించదని, వారిపై క్రమ శిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మొత్తానికి.. ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు, అటు ప్రభుత్వం మధ్య ఆర్టీసీ కార్మికులు ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది. ఆర్టీసీ జేఏసీ నేతల నమ్మిన కార్మికులకి న్యాయం చేరగకపోగా.. ఉన్న ఉద్యోగాలేపోయే పరిస్థితి వచ్చింది. ఇక ప్రభుత్వం ఇదివరకే డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో కార్మికుల బాధని సహృదయభావంతో చూసే అవకాశం కనిపించడం లేదు. మొత్తంగా లేబర్ కోర్టు తీసుకొనే నిర్ణయంపైనే ఆర్టెసీ కార్మికుల భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పవచ్చు.