ఆర్టీసీపై హైకోర్టులో మరో కీలక పిటిషన్ !
ఇన్నాళ్లు ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్, దానిపై ప్రభుత్వ వైఖరిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇప్పుడు కార్మికులని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలనే వాదనలు జరగనున్నాయి. తాజాగా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పీఎల్ విశ్వేశ్వరరావు ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని అమైండ్మెంట్ పిటిషన్ దాఖలు చేశారు.
సమ్మె విరమించినా కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడం లేదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. జీతాలు లేక ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు, ఆర్టీసీని ప్రయివేటు పరం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. దీనిపై రేపు జరగనున్న కేబినేట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగాలు పోతాయేమోననే టెన్షన్ ఆర్టీసీ కార్మికుల్లో నెలకొంది.