అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి.. కానీ.. !

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాజకీయ చాణిక్యం ముందు బీజేపీ వ్యూహాలు ఫలించలేదు. ఫలితంగా మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయక తప్పలేదు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరిగి సొంత గూటికి చేరక తప్పలేదు. ఇప్పుడు మహారాష్ట్ర వికాస్‌ కూటమి ప్రభుత్వ ఏర్పాటు విషయంలోనూ శరద్ పవార్ తన వ్యూహాలని అమలు చేస్తున్నట్టు స్పష్టం కనిపిస్తోంది. 

మహారాష్ట్ర వికాస్‌ కూటమి ప్రభుత్వంలోనే అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఐతే,  మహారాష్ట్ర శాసనసభలో డిసెంబరు 3వ తేదీన విశ్వాస పరీక్షలో నెగ్గాకే.. అజిత్ పవార్ తో డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించాలని శరద్ పవార్ నిర్ణయించారని పార్టీ వర్గాల సమాచారం. గురువారం సాయంత్రం మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాకరేతోపాటు సీనియర్ శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నుంచి చుగన్ భుజబల్, జయంత్ పాటిల్, కాంగ్రెస్ పార్టీ నుంచి బాలాసాహెబ్ థొరాట్, అశోక్ చవాన్ లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని సంకీర్ణ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక స్పీకర్ పదవి కాంగ్రెస్ కే దక్కింది.