చంద్రబాబుకు ఘోర అవమానం

ఏపీ రాజధాని అమరావతిలో తెదేపా అధినేత చంద్రబాబుకు ఘోర అవమానం ఎదురైంది. చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబు గో బ్యాక్ అని ఓ వర్గం రైతులు నినాదాలు చేయడం టెన్షన్ కు దారితీసింది. కొందరు ఆందోళనకారులు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.

చంద్రబాబు అమరావతి పర్యటన నేపథ్యంలో రాజధాని రైతులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అనుకూలంగా ఓ వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం నిరసనకు దిగాయి. పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ఓవైపు స్వాగతాలు, మరోవైపు నిరసనలతో అమరావతిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు, రాజధాని ప్రాంతంలో పర్యటించే అర్హత చంద్రబాబుకి లేదంటూ.. రాజధాని ప్రాంత కూలీల పేరుతో బ్యానర్లు ఏర్పాటు వెలిశాయి. తాజా ఘటన వైస్రాయ్ ఘటనని తలపించిందని సీనియర్ నేతలు చెప్పుకొంటున్నారు. ఆనాడు వైస్రాయ్ హోటల్ లో ఎన్టీఆర్ పై చంద్రబాబు చెప్పులు, రాళ్లతో దాడి చేయించారనే ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అమరావతి వేదికగా చంద్రబాబుకు అదే శాస్త్రీ జరిగిందని ఆయన వ్యతిరేకులు గుసగుసలాడుకొంటున్నారు.