ఆర్టీసీ కార్మికులకు తీపికబురు

సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు తీపికబురు చెప్పారు. కార్మికులు విధుల్లో చేరేందుకు ఎలాంటి షరతుల్లేవని.. రేపు ఉదయం అందరూ విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమస్యపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. సమావేశం ముగిసిన తర్వాత ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేబినెట్ నిర్ణయాలను సీఎం వెల్లడించారు.

కార్మికులంతా రేపు ఉదయానికల్లా విధుల్లో చేరండి..హాయిగా ఉడండి. ఎలాంటి షరతులు పెట్టం. దీనిపై కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేస్తాం. తాత్కాలికంగా ఆర్టీసీకి రూ.100 కోట్లు మంజూరు చేస్తాం. కిలోమీటరుకు 20పైసలు పెంచితే ఏడాదికి రూ.750 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. వచ్చే సోమవారం నుంచి ఛార్జీలు పెంచుకునే అధికారం ఆర్టీసీ ఎండీకీ కల్పిస్తూ ఉత్తర్వులిస్తాం.ప్రైవేటు బస్సులు పెట్టం. ప్రైవేటు రూట్లకు పర్మిట్లు ఇవ్వాలనుకున్న విధానం వేరు.

ఇప్పటికైనా కార్మికులు వాస్తవాలు తెలుసుకుని భవిష్యత్ లో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దు. అలా చేస్తే నష్టపోయేది కార్మికులే. ఆర్టీసీ పరిస్థితిని 49వేల మంది కార్మికులకు వివరిస్తాం. ఆర్టీసీ పరిస్థితిపై ప్రగతిభవన్ కు పిలిచి కార్మికులతో నేరుగా చర్చిస్తాం. యూనియన్లకు మాత్రం ఇందులో అవకాశం కల్పించే ప్రసక్తి లేదు. సమ్మె కారణంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటాం. కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో వారి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశం కల్పిస్తాం. తక్షణం వారి కుటుంబాలకు సాయం చేస్తాం అని కేసీఆర్ తెలిపారు.