నిందితురాలికి.. ఓ ఐఏఎస్ భార్య సహకారం !
ఐఎంఎస్ (బీమా వైద్యసేవల) విభాగం కుంభకోణంలో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. నిందితురాలితో ఐఏఎస్ అధికారి సతీమణి పలుమార్లు ఫోన్లు మాట్లాడినట్టు.. దర్యాప్తులో తేలింది. ఫోన్ ను ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల (ఎఫ్ ఎస్ ఎల్ )కు పంపించారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా దర్యాప్తులో ముందుకెళ్లే అవకాశాలున్నాయి.
వీరిద్దరి మధ్య లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. వజ్రాలు, విలువైన అభరణాలు ఐఏఎస్ అధికారి సతీమణికి అందినట్టు అనుమానిస్తున్నారు. ఈ కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తు ఆరంభించిన తొలి నాళ్లలో కీలక నిందితురాలిని సదరు ఐఏఎస్ అధికారి వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకునేట్లు చేస్తామని దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. మిగిలిన నిందితుల విషయంలో దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పారు. ఐతే, ఏసీబీ ఆయన సూచనను పక్కనపెట్టి దర్యాప్తు లోతుల్లోకి వెళ్లడంతో కీలక నిందితురాలి అక్రమాలు భారీ ఎత్తున బహిర్గతమయ్యాయి.