కాంగ్రెస్ ఎఫెక్ట్ : శివసేన నేతల రాజీనామా
మహారాష్ట్రలో బద్దశత్రువైన కాంగ్రెస్ తో శివసేన చేతులు కలపడం.. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఐతే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అనే సామేత ఉండనే ఉంది. ఇప్పుడు అదే సామెతని శివసేన ఫాలో అయింది. ఐతే, శివసేన కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ కలవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనేశివసేన యువనేత రమేష్ సోలంకి రాజీనామా చేశారు. గత 21 సంవత్సరాలుగా రమేష్ సోలంకి శివసేన పార్టీతో కలిసి పనిచేస్తున్నారు. ఆ పార్టీ విద్యార్థి విభాగం భారతీయ విద్యార్థి సేన (బీవీఎస్), యువసేనలో కీలక పదవుల్లో ఉన్నారు.
కాంగ్రెస్తో శివసేన కలవడం ఇష్టం లేక పార్టీని వీడుతున్నట్లు సోలంకి ప్రకటించారు. ”మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్కు, శివసేన నుంచి తొలిసారి సీఎం అవుతున్న ఉద్ధవ్ ఠాక్రేకు నా అభినందనలు. సిద్ధాంతాలకు విరుద్ధంగా నేను కాంగ్రెస్తో కలిసి పనిచేయలేను. అందుకు నా మనసు అంగీకరించడం లేదు. అందుకే రాజీనామా చేస్తున్నా. నేను ఎప్పటికీ బాల్సాహేబ్ శివసైనికుడినే” అని రమేష్ సోలంకి ట్విట్ చేశారు. రమేష్ సోలంకి బాటలోనే మరికొందరు శివసైనికులు వెళ్లనున్నట్టు సమాచారమ్.