రివ్యూ : అర్జున్ సురవరం

చిత్రం : అర్జున్‌ సురవరం

నటీనటులు : నిఖిల్‌, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళీ,  తదితరులు

సంగీతం : సామ్‌ సీ.ఎస్‌

దర్శకత్వం : టీఎన్‌ సంతోష్‌

నిర్మాత : రాజ్‌కుమార్‌ ఆకెళ్ల

రిలీజ్ డేటు :  29డిసెంబర్, 2019

యంగ్ హీరో నిఖిల్ సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి. అందుకే ప్రేక్షకులు ఆయన సినిమాపై నమ్మకంగా ఉంటారు. కచ్చితంగా థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలని ఆశపడుతుంటారు. ఐతే, ‘ఎక్కడికిపోతావు చిన్నివాడా’ తర్వాత నిఖిల్ నుంచి ఆ రేంజ్ సినిమా రాలేదు. అయినా.. ఆయన తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’పై ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన అర్జున్ సురవరం ప్రేక్షకుల నమ్మకాన్నినిలబెట్టిందా ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

అర్జున్‌ లెనిన్‌ సురవరం (నిఖిల్‌) సాప్ట్‌వేర్‌ ఉద్యోగి. ఐతే, జర్నలిజంపై ఉన్న ఇష్టంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి.. ఓ టీవీ చానెల్‌లో రిపోర్టర్‌గా చేరుతాడు. బీబీసీలో పనిచేయాలన్నది అతని కల. కావ్య (లావణ్య త్రిపాఠి)ని ప్రేమిస్తాడు. ఆమె అర్జున్‌ పనిచేస్తున్న టీవీ చానెల్‌ సీఈవో కూతురే. అర్జున్ లక్ష్యం నెరవేరుతుంది. ఆయనకి బీబీసీలో ఉద్యోగం వస్తుంది. ఐతే, అనూహ్యంగా అర్జున్ ని  పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ పెట్టి అర్జున్‌తో పాటు మరికొందరు ఎడ్యుకేషన్‌ లోన్స్‌ పేరిట బ్యాంకులకు పెద్దమొత్తంలో టోకరా వేసినట్టు పోలీసులు అభియోగాలు మోపుతారు. ఈ కేసులో అర్జున్ కి కోర్టు శిక్ష కూడా విధిస్తుంది. చివరికి బెయిల్ పై బయటికొచ్చిన అర్జున్.. ఈ కేసుని ఎలా చేధించాడు ? సూతధారి ఆట ఎలా కట్టించాడు ?? అనేది కథ.

ప్లస్ పాయింట్స్ :

* కథ

* ట్విస్టులు

* కొన్ని ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

* సెకాంఢాఫ్

* నేపథ్య సంగీతం

* అక్కడక్కడ స్లో నేరేషన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

దర్శకుడు ఎంచుకొన్నకథ బాగుంది. ఫేక్‌ సర్టిఫికెట్స్‌తో సమాజానికి పెనుసవాలుగా నిలిచిన ఓ భారీ స్కాంను ఓ రిపోర్టర్‌ ఎలా వెలుగులోకి తీసుకొచ్చడన్నది అర్జున్‌ సురవరం కథ. నేరుగా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. ఇంట్రస్టింగ్‌ కథనంతో వరుస ట్విస్టులతో కథని వేగంగా నడిపాడు. దాంతో ఫస్టాఫ్ సినిమా బాగా అనిపించింది. సెకండాఫ్‌ కూడా ఈ రేంజ్ లో ఉంటే అర్జున్ సురవరం హిట్టే అనుకొన్నారు. కానీ, సెకాంఢాఫ్ లో ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు స్లోగా సాగాయి. బోర్ కొట్టించాయి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు మళ్లీ సినిమాని నిలబెట్టాయని చెప్పవచ్చు. మొత్తానికి.. అర్జున్ సురవరం అదిరిపోయే సినిమా అని చెప్పకున్నా.. బాగుంది. ప్రత్యేకంగా యూత్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్.

ఇక నిఖిల్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకొన్నాడు. ఈజీగా నటించేశాడు. ఫాఫ్ట్ వేర్ ఉద్యోగం నుంచి జర్నలిస్ట్ గా మారినా.. న్యాయం చేయగలిగాడు. ఏమోషన్ సీన్స్ లోనూ ఆకట్టుకొన్నాడు. లావణ్య త్రిపాఠి అందంగా కనిపించింది. కాకపోతే, ఆమెని ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ కి మాత్రమే పరిమితం చేశారు. ఉన్నంతలో బాగానే చేసింది. కానిస్టేబుల్‌ సుబ్బారావుగా పోసాని, ఆయన కొడుకు పాత్రలో వెన్నెల కిషోర్‌ నటన చాలా బాగుంది. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :

ఇలాంటి సినిమా రేంజ్ ని పెంచే అవకాశం నేపథ్య సంగీతానికి ఉంటుంది. ఐతే, ఇందులో నేపథ్య సంగీతం సాదాసీదాగా అనిపించింది. సినిమాలో వచ్చే డైలాగ్స్ అదిరిపోయింది. ఎమోషన్స్ సీన్స్ అవి మరింత పండించాయి. పాటలు ఓ మోస్తరుగానే ఉన్నాయి. సెకాంఢాఫ్ లో సినిమా స్లోగా సాగింది. కొన్ని సీన్స్ కి కత్తెర పెట్టొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది.  నిర్మాణ విలువులు బాగున్నాయి.

చివరగా : అర్జున్ సురవరం.. ఆకట్టుకొన్నాడు !

రేటింగ్ : 2.75/5