‘నిర్భయ’ ధోషులకి ఉరిశిక్ష ఎప్పుడంటే ?

‘దిశ’ నిందితులకి తక్షణమే ఉరిశిక్ష విధించాలనే డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన నిందితులకే ఇప్పటి వరకు ఉరిశిక్ష అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో చట్టాలని మార్చాలి. నిర్భయ, దిశ లాంటి ఘటనలో నిందితులని కఠినంగా శిక్షించేలా, ఒక్కమాటలో చెప్పాలంటే తక్షణమే ఉరిశిక్ష విధించేలా చట్టాలు చేయాలని రాజకీయవర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇంతకీ నిర్భయ ధోషులకి ఉరిశిక్ష విధించడంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే.. ?

ఢిల్లీలో 2012 డిసెంబరు 16వ తేదీన కదులుతున్న బస్సులో ఒక పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బస్సు నుంచి రోడ్డు పక్కన పడేశారు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె అదే సంవత్సరం డిసెంబర్ 20న కన్నుమూసింది. ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా నిర్ణయించారు. అంతే కాకుండా ఆ పేరుపై మహిళల సంరక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని (నిర్భయ) ప్రభుత్వం తెచ్చింది. అయినా.. దేశంలో అరాచకాలు ఆగడం లేదు.  

ఇక నిర్భయ కేసులో శర్మ, ముకేశ్, పవన్, అక్షయ్, రామ్ సింగ్, ఓ మైనర్ బాలుడు నిందితులు కాగా, మైనర్ బాలుడు విడుదలయ్యాడు. రామ్ సింగ్ జైల్లోనే ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన నలుగురినీ ఉరితీయాల్సి ఉంది. ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్న వినయ్‌శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. 

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే కోర్టు దోషులను ఉరి తీయాలని బ్లాక్ వారెంట్ జారీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి తీసే తలారీ లేకపోవడంపై జైలు అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఉరి తీసే తలారీ ఉద్యోగాన్ని భర్తీ చేయడం, లేదా తాత్కాలికంగా ఎక్కడైనా పని చేస్తున్న వారిని తీహార్‌ జైలుకు బదిలీ చేసి.. శిక్షను అమలు పరిచేలా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. బహుశా.. అతి త్వరలోనే నిర్భయ నిందితులకి ఉరిశిక్ష అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిశ ఘటన కూడా నిర్భయ దోషులకి తక్షణం ఉరిశిక్షపడేలా ఒత్తిడి తెస్తుందని చెప్పవచ్చు.