పవన్ వ్యాఖ్యలు దేనికి సంకేతం ?
ఒక్కరోజు తేడాతోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ హిందుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు వివాదాలకి, గొడవలకి కారణమే హిందువులు అన్నట్టుగా పవన్ మాట్లాడారు. దానికి బీజేపీ నేతల నుంచి పవన్ కి కౌంటర్లు కూడా పడ్డాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పవన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు పవన్ కి హిందుత్వం గురించి తెలుసా ? పవన్ హిందువేనా ?? అంటూ ప్రశ్నించారు.
ఇది జరిగి రోజు కూడా గడవక ముందే పవన్ మాట తీరు మారింది. తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ బుధవారం కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాల జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు. రైతు సమస్యలు, నిత్యావసరాల ధరల పెంపు, రాయలసీమ వెనకబాటుతనం, తెలుగు వైభవం, హిందూ ధర్మ పరిరక్షణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడిన పవన్ భాజపాకు ఏరోజూ దూరం కాలేదన్నారు.
ప్రత్యేకహోదా సహా కొన్ని అంశాలకోసమే విమర్శలు చేశాను తప్ప భాజపాకు ఏరోజూ దూరం కాలేదన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటే తనకు ఇష్టమని పవన్ వ్యాఖ్యానించారు. వైకాపా నేతలకు అమిత్ షా అంటే భయమన్నారు. తాము తెదేపాతో ఉంటే ఎన్నికల్లో వారితోనే కలిసి పోటీ చేసేవాళ్లమని.. విడిగా పోటీ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పవన్ ఒక్కరే భాజాపాకి దగ్గర కాబోతున్నారా ? లేదంటే.. తెదేపా, జనసేన రెండు పార్టీలు భాజాపాతో మళ్లీ కలవనున్నాయా ? అనే చర్చ మొదలైంది. మరోవైపు జనసేన భాజాపాలో విలీనం కాబోతుందనే చర్చ కూడా సాగుతోంది.
అదే నిజమైతే.. భవిష్యత్ లో జగన్ అసలు సిసలు ప్రత్యర్థిగా పవన్ మారడం ఖాయం. ఏపీలో అధికారంలోకి రావాలని ఆశపడుతున్న భాజాపా పవన్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ కోరికని తీర్చుకోబోతుందా ? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.