వెంకీమామ.. నవరసాలున్న అచ్చ తెలుగు సినిమా !

విక్టరీ వెంకటేష్, ఆయన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటించిన చిత్రం ‘వెంకీమామ’. మామ-అల్లుళ్లు కలిశారు. కామెడీతో కేకపుట్టిస్తారని అందరు అనుకొన్నారు. కానీ, వెంకీమామలో అన్నీ రసాలు ఉంటాయట. ఒక్కమాటలో చెప్పాలంటే.. నవరసాలున్న అచ్చ తెలుగు సినిమా వెంకీమామ అని చిత్రబృందం చెబుతోంది. బుధవారం హైదరాబాద్ లో వెంకీమామ చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో చిత్రబృందం మాట్లాడిన మాటలతో సినిమా వెంకీమామ ఎలా ఉండబోతున్నాడు అనే దానిపై ఓ క్లారిటీ వచ్చినట్టయింది. తొలి సగభాగం హాస్యభరితంగా, ద్వితీయార్ధం భావోద్వేగాలతో సాగుతుందట. 

ఇందులో నాగచైతన్య ఆల్ రౌండర్ గా మంచి అభినయం ప్రదర్శించారట.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్ల మేనమామ గుర్తుకొస్తాడు. మేనమామలకి వాళ్ల అల్లుళ్లు గుర్తుకొస్తారు. మామ పాత్ర బాగుండాలని చైతన్య, అల్లుడు పాత్ర బాగుండాలని వెంకటేష్ కోరుకుంటూ ఈ సినిమా చేశారని దర్శకుడు బాబీ చెప్పారు. బంధాలు, భావోద్వేగాలు, త్యాగాలు, వినోదం… ఇలా అన్ని అంశాలు ఉన్న కథ ఇది. జనార్ధన మహర్షి ఇచ్చిన ఈ కథని బాగా తీర్చిదిద్దారు బాబీ. రాజమండ్రి, హైదరాబాద్, కశ్మీర్ లో చిత్రీకరించామని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్, చైతూ సరసన రాశీఖన్నా నటించారు. ఈ నెల 13న చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.