దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్ :  పోలీసులపై పూల వర్షం


దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులపై ప్రశంసలతో పాటు పూల వర్షం కురిసింది. నంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశని నలుగురు కిరాతకులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై యావర్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిందితులని తక్షణమే ఉరితీయాలనే డిమాండ్ సర్వత్రా వినిపించింది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఐతే, పరిస్థితి అంతవరకు రాలేదు.

శుక్రవారం తెల్ల‌వారుజామున గం.3.30 స‌మ‌యంలో దిశ నిందితులు ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులని పోలీసులు  ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పోలీసులని ప్రతి ఘటించి పారిపోయేందుకు యత్నించారు. దీంతో నిందితులని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ పై సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.  

అంతేకాదు.. ఎన్‌కౌంటర్ జరిగిన ఘ‌ట‌న ప్ర‌దేశంలో ఉన్న‌ పోలీసుల‌పై ప్రజలు పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. వారికి స్వీట్స్ తినిపించి నోరు తీపి చేస్తున్నారు. తెలంగాణ పోలీస్ జిందాబాద్ అంటూ కేక‌లు వేస్తున్నారు .సీపీ సజ్జ‌నార్ , తెలంగాణ పోలీస్ , సీఎం కేసీఆర్‌పై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపిస్తున్నారు. ఎన్‌కౌంటర్ సంఘటన ప్రదేశాన్ని చూడ్డానికి వేల సంఖ్యలో జనాలు తరలివచ్చారు. పోలీసులకి జై కొట్టడంతో పాటు వారిపై పూల వర్షం కురిపించడం విశేషం.