ఇచిత్రం : వైకాపాలోకి భాజాపా నేతలు
కొంతకాలంగా, ఇంకా చెప్పాలంటే ఇటీవల లోక్ సభ ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరేవారే. కానీ, బీజేపీ నుంచి ఇతర పార్టీలకి వెళ్లిన వారు లేరనే చెప్పాలి. దానికి కారణం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు. తెలంగాణలో తెరాస, ఏపీలో వైకాపా బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెండు పార్టీలని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు.
తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పోరాడలేని పరిస్థితి. ఏపీలోనూ తెదేపా పరిస్థితి అంతే. ఈ నేపథ్యంలో అధికారిక పార్టీతో పడని, ప్రతిపక్షాల్లో ఉండలేని నేతలు బీజేపీ మంచి ఆప్షన్ గా మారింది. కేంద్రంలో భాజాపాదే అధికారం కావడం మరింత బలాన్ని ఇస్తుందన్నది వారి భావన. దానికితోడు రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే వ్యూహాంతో కమలం పార్టీ ఉంది.
ఇందుకోసం భాజాపా జాతీయాధ్యక్షుడు అమిత్ షానే స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన తెలంగాణలోనే క్రియాశీల పార్టీ సభ్యత్వం తీసుకొన్నారు. ఏపీలోనూ ఎదిగేందుకు భాజాపా ఫోకస్ పెట్టింది. ఇందుకోసం జనసేనని భాజాపాలో కలుపుకునేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారమ్. ఇలాంటి టైం లో ఏపీ భాజాపా నుంచి వైసీపీలోకి వలసలు మొదలవ్వడం విశేషం.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భాజపా సీనియర్ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో చేరిక విషయాన్ని గంగరాజు సోదరుడు గోకరాజు రామరాజు ధ్రువీకరించారు. ఆయనతో పాటు అతని సోదరుడు, డీఎన్‌ఆర్ కళాశాల అధ్యక్షుడు వెంకట నరసింహరాజు, గోకరాజు గంగరాజు కుమారుడు జీవీకే రంగరాజు వైకాపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వారంతా సీఎం జగన్ సమక్షంలో వైకాపాలో చేరనున్నట్లు సమాచారమ్.