రాఘవేంద్రరావుని ఏడిపించిన వెంకీమామ
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు భావోద్వేగానికి గురయ్యారు. విక్టరీ వెంకటేష్, ఆయన మేనల్లుడు నాగ చైతన్య కలసి నటించిన చిత్రం ‘వెంకీమామ’. బాబీ దర్శకుడు. పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా కథానాయికలు. ఈ వారమే వెంకీమామ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ లో ‘వెంకీమామ’ మ్యూజికల్ నైట్ ని నిర్వహించారు. ఈ వేడుకకి రాఘవేంద్ర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాఘవేంద్ర రావు.. తనకు రామానాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వెంకటేష్, చైతన్యతో ఓ చిత్రం చేయాలని ఆయన ఉన్నప్పుడు ఎన్నోసార్లు తనతో అన్నారని.. ఇప్పుడు ఆయన కోరిక తీరబోతుంది అన్నారు. అన్నమయ్య సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పుడు మా నాన్నగారు ఉన్నారు. కానీ విడుదలయ్యే సమయానికి ఆయన లేరని కంటతడి పెట్టుకొన్నారు. దీంతో.. పక్కనే ఉన్న రానా ఆయన్ని ఓదార్చారు.