ట్రంప్‌ పదవి పోతుందా ?

అగ్రరాజ్యం అమెరికా రాజకీయాలు హీటెక్కాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. అభిశంసనకు అనుకూలంగా 230 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 197 ఓట్లు పోలయ్యాయి.

ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు బుధవారం ఆయనపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో డెమోక్రాట్లదే ఆధిపత్యం కావడంతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ సెనేట్‌లో విచారణ ఎదుర్కోనున్నారు. అక్కడ కూడా ఈ తీర్మానం ఆమోదం పొందితేనే అభిశంసన ప్రక్రియ పూర్తవుతుంది. అంటే అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ వైదొలుగుతారు. ఐతే, ఆ పరిస్థితి దాదాపు రాకపోవచ్చు. ఎందుకంటే.. ? సెనేట్‌లో రిపబ్లికన్లదే ఆధిక్యం. అభిశంసనని ఎదుర్కొంటున్న మూడో అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ నిలిచారు.