సల్మాన్ తో కలిసి వెంకీ, చరణ్ స్టెప్పులు


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘దబంగ్‌ 3’. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సోనాక్షి సిన్హా కథానాయిక. హిందీతోపాటు తెలుగులోనూ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ తెలుగులో సమర్పిస్తోంది. డిసెంబరు 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకి విక్టరీ వెంకటేష్‌, రామ్‌ చరణ్‌ అతిథులుగా హాజరయ్యారు.

స్టేజ్ పై సల్మాన్ భాయ్ తో కలిసి వెంకీ, చరణ్ స్టెప్పులేశారు. ప్రేక్షకులని ఖుషి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సల్మాన్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకి సన్నిహితులు అన్నారు. ఇక వెంకీమామ తనకి 25యేళ్లుగా మంచి మిత్రుడని తెలిపారు. అందరూ సినిమా చూడండి, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు సల్మాన్.

వెంకీ మాట్లాడుతూ.. “దబంగ్ 3′ హిందీలో కాకుండా తెలుగులోనూ వస్తోంది. చాలా సంతోషంగా ఉంది. తెలుగు ట్రైలర్‌ చాలా బాగుంది. సల్మాన్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో దుమ్మురేపాడు. మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమాను సూపర్‌ సక్సెస్‌ చేయాలి” అన్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ.. “సల్మాన్‌ భాయ్‌పై నాకున్న ప్రేమను చెప్పలేను. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. సల్మాన్‌, వెంకీ, సుదీప్‌, చిరంజీవి లాంటి సూపర్‌స్టార్స్‌ నుంచి నేను ఓ కామన్‌ విషయం నేర్చుకున్నా. అదే క్రమశిక్షణ.. నేటి మా తరం వీరి నుంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి. ప్రభుదేవా సర్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు.