రివ్యూ : మత్తు వదలరా – కిక్కునిస్తుంది
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శకుడు రాజమౌళి. అలాంటి ఫ్యామిలీ నుంచి ఓ హీరో తెరంగేట్రం చేస్తున్నాడంటే.. ? ఆ హడావుడి ఏ రేంజ్ లో ఉండాలి. కానీ, అవేవి లేకుండా సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా ‘మత్తు వదలరా’ చిన్ని సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి రితేష్‌రానా దర్శకత్వం వహించారు. డ్యూయెట్స్, ప్రేమకథ లేకుండా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో స్టార్ హీరోలు తారక్, రామ్ చరణ్, ప్రభాస్, రానా, దర్శకులు రాజమౌళి, సుకుమార్ తదితరులు ప్రశంసలు కురిపించారు. ఓ విభిన్న సినిమాగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మత్తు వదలరా’ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
బాబు మోహన్ అలియాస్ బాబు (శ్రీసింహా) డెలివరీబాయ్ గా పని చేస్తుంటాడు. స్నేహితులు అభి (నరేష్ అగస్త్య), ఏసు (సత్య)లతో కలిసి ఓ మురికివాడలో అద్దెకు ఉంటాడు. జీతం సరిపోక ఉద్యోగంపై అసంతృప్తితో ఉన్న బాబుకి ఆయన స్నేహితుడు ఏసు ఓ సలహా ఇస్తాడు. అదే దొంగతనం. పార్శిల్స్ ఇచ్చే సమయంలో కస్టమర్స్ నుంచి ఈజీగా డబ్బులు దొంగిలించ వచ్చన్నది ఏసు ఇచ్చిన సలహా. తొలి ప్రయత్నంలోనే ఓ ముసలమ్మ దగ్గర డబ్బులు దొంగిలిస్తూ బాబు దొరికిపోతాడు.
ఆ సమయంలో ముసలమ్మ కిందపడిపోవడంతో ఆమె చనిపోయిందని భ్రమపడిన బాబు తనకు సంబంధించిన ఆధారాలేవి ఆ ప్రదేశంలో కనిపించకుండా తుడిచేయాలని అనుకుంటాడు. మత్తు కలిపిన నీళ్లు తాగడం వల్ల ఆ ఫ్లాట్‌లోనే నిద్రలోకి జారుకుంటాడు. ఆ మత్తు వదిలి లేచే సరికి.. అతడి పక్కనే ఓ వ్యక్తి శవం.. ఆ హడావిడిగా తన బ్యాగ్ తీసుకొని ఆ ఫ్లాట్ నుంచి బాబు బయటపడతాడు. బాబు తెచ్చిన బ్యాగులో భారీగా డబ్బు ఉంటుందని తర్వాత తెలుస్తుంది. నిజంగానే బాబు ఆ హత్యచేశాడా ? డ్రగ్ డీలర్ మైరా (అతుల్య చంద్ర), రవి(వెన్నెల కిషోర్)లతో బాబు స్నేహితుడు అభికి ఉన్న సంబంధం ఏంటీ ? అనేది వినోదం, సస్పెన్స్ తో కూడిన కథే మత్తు వదలరా.
ఎలా ఉందంటే ?
ఇది వరకు తెలుగు తెరపై రాని కొత్త పాయింట్ ఇది. మర్డర్ మిస్టరీ పాయింట్‌కు వినోదాన్ని జోడిస్తూ థ్రిల్లింగ్ సినిమాగా ‘మత్తు వదలరా’ ని తీర్చిదిద్దారు. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం 2019 ఏడాదికి చక్కటి ముగింపుగా నిలుస్తుందని చెప్పవచ్చు. రితేష్ రానాకు ఇదే తొలి సినిమా. అయినా.. ఎక్కడా తడబాటు కనిపించలేదు. పాటలు, రొమాంటిక్ ట్రాక్ కాకుండా తాను నమ్మిన అంశాన్ని నిజాయితీగా తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. రెండు గంటల పాటు ప్రేక్షకులకు చక్కటి థ్రిల్‌ను పంచారు.
తొలి సన్నివేశం నుంచే సినిమా ఆసక్తిని రేకెత్తిస్తుంది. సాధారాణ డెలివరీ బాయ్‌గా బాబుకు ఎదురయ్యే కష్టాలు, తన స్నేహితుడు ఏసు సలహాతో బాబు దొంగతనానికి ప్రయత్నించడం, అక్కడ అతడికి ఎదురయ్యే సంఘటనలతో ప్రథమార్థం నవ్విస్తూనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. ఇక సెకాంఢాఫ్ లో ఒక్కో చిక్కుముడిని విప్పుతూ దర్శకుడు కథనాన్ని నడిపించిన తీరు అద్భుతం. సినిమా కథని ఇంకా రివీల్ చేస్తే బాగుండదు.. థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే.
ఎవరెలా చేశారంటే ?
రితేష్ రానాకు ఇదే తొలి సినిమా. అయినా.. ఎక్కడా తడబాటు కనిపించలేదు. దర్శకుడిగా రితేష్ కి మంచి భవిష్యత్ ఉందని చెప్పవచ్చు. కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా మంచి నటనని కనబరిచాడు. వాస్తవ పరిస్థితులకు, భయానికి మధ్య నలిగిపోతూ సంఘర్షణకు లోనయ్యే డెలివరీ బాయ్ పాత్రలో ఒదిగిపోయాడు. వినోదం, ఎమోషన్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. బాబు స్నేహితుడిగా సత్య పాత్రని దర్శకుడు బాగా వినియోగించుకున్నాడు. ఆ పాత్రతో కావాల్సినంత వినోదం పంచాడు. బాబు మరో స్నేహితుడిగా నటించిన నరేష్ అగస్త్య నటన బాగుంది. డ్రగ్స్ తయారుచేసే వ్యక్తిగా వెన్నెలకిషోర్ పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో నవ్విస్తుంది. ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకి న్యాయం చేశారు.
సాంకేతికంగా :
ఈ సినిమాకి కీరవాణి పెద్ద కొడుకు కీరవాణి సంగీతం అందించారు. ఇందులో పాటలు లేవు. నేపథ్య సంగీతంతో కాల భైరవ మేజిక్ చేశాడు. నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణంపోసింది. కథ, పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ కావడానికి నేపథ్య సంగీతం తోడ్పడింది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎక్కడా బోర్ కొట్టదు. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
* కథ-కథనం
* దర్శకత్వం
* వినోదం, ఎమోషన్
* నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
* ఈ ప్రయోగాత్మక సినిమాలో మైనస్ లు గుర్తించడం కష్టం
చివరగా :
రొటీన్ సినిమాల మత్తు నుంచి బయటపడేలా చేసే సినిమా ఇది. వినోదం, థ్రిల్లర్ రెండు దొరుకుతాయ్. విభిన్న సినిమాలు ఇష్టపడే వారికి మత్తు వదలరా మంచి ఆప్షన్.
రేటింగ్ : 3.5/5