చిరు మాటతో దర్శకుడినయ్యా.. !

చిన్న సినిమాలతో పెద్ద విజయాలని అందుకొనే దర్శకుడుగా మారుతికి పేరుంది. కెరీర్ మొదట్లో ఆయన నుంచి బోల్డ్ సినిమాలొచ్చాయ్. ఆ బూతు ముద్రని చెరిపోసుకొని ఫ్యామిలీ దర్శకుడుగా ఎదిగారు మారుతి. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, బాబు బంగారం లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఆకట్టుకొన్నారు. ఆయన తాజా చిత్రం ప్రతిరోజూ పండగే. సాయితేజ్-రాశీఖన్నా జంటగా నటించిన పండగ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ తో రన్ అవుతోంది.

ఈ నేపథ్యంలో సాయితేజ్ తో కలిసి ఈటీవీలో అలీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. దర్శకుడిని కావాలనే కోరిక ఎలా పుట్టిందని అలీ అడిగిన ప్రశ్నకి మారుతి ఆసక్తికర సమాధానం చెప్పారు. “2000లో నాకు బన్నితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అరవింద్‌గారి ఇంట్లో తిరగడం.. ఇండస్ట్రీని దగ్గరి నుంచి చూడటం అలవాటైంది. ఆ తర్వాత కొన్నాళ్లు యానిమేషన్‌ రంగంలో పనిచేశా. తర్వాత చిరంజీవిగారి దగ్గర ఉండేవాడిని. ఆయన యాడ్‌ ఫిల్మ్స్‌ పనులు చూస్తుండేవాడిని. అప్పుడే ఆయన ‘నీలో దర్శకుడు ఉన్నాడురా. ప్రయత్నించు’ అన్నారు. దాంతో నాకు నమ్మకం కలిగింది. అప్పుడు ‘బస్టాప్‌’అనే కథ రాసుకుని, నా ప్రపంచాన్ని సృష్టించుకున్నా”నని తెలిపారు.