రైతుల రాజధాని పోరు.. నేతల హౌస్ అరెస్టులు !
ఏపీకి మూడు రాజధానుల వ్యవహారం రేపటి (డిసెంబర్ 27)తో తేలిపోనుంది. రేపు ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఏపీకి మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు ఆందోళనలకి మరింత ఉధృతం చేశారు. రోడ్లపైనే వంటావార్పు చేస్తున్నారు. రోడ్లపై టెంట్లు వేసుకొనేందుకు ప్రయత్నించిన రైతులని పోలీసులు అడ్డుకోవడంతో.. వాగ్వాదం చేటుచేసుకొంది.
మరోవైపు, న్యాయవాదులు ప్రకాశం బ్యారేజ్ పై రూట్ మార్చికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. అక్కడ పోలీసులని మోహరించారు. రాజధాని రైతులకి మద్దతు ఇచ్చేందుకు బయలుదేరిన తెదేపా నేతలని పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తెదేపా నేతలు కేశినేని నాని, బుద్ధా వెంకన్న తదితరులని హౌస్ అరెస్ట్ చేశారు.
మొత్తంగా ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, ఏపీ డీజీపీ, మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై ఆరా తీయనున్నారు. ఇక రేపు ఉదయం 10:30గంటలకి ఏపీ కేబినేట్ సమావేశం కానుంది. రాజధానిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏపీకి మూడు రాజధానులు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రేపు కేబినేట్ భేటీలో దీనిపై చర్చించి.. ప్రకటన చేయడమే తరువాయి అని తెలుస్తోంది.