విజయసాయి పేరుతో సెటిల్ మెంట్స్

విశాఖపట్నం ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని కానుంది. దీనిపై గురువారం ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది. అంతకంటే ముందే ఈరోజు ఈ విషయాన్ని వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ధృవీకరించారు. ఏపీ రాజధానిగా విశాఖ ప్రకటన తర్వాత ఈ నెల 28న సీఎం జగన్ తొలిసారి విశాఖ రానున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలకాలని ట్విట్టర్ వేదిక ప్రజలు, కార్యకర్తలని కోరారు విజయసాయి. దీంతో ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ప్రకటన ఖాయమని తేలిపోయింది.

మరోవైపు, విశాఖలో విజయసాయి పేరుతో సెటిల్ మెంట్స్ దందా జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా దీనిపై విజయసాయి క్లారిటీ ఇచ్చారు. తన పేరుతో ల్యాండ్ సెటిల్ మెంట్లు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టండని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోలీసులకు చెప్పారు. 

‘ఈ మధ్యకాలంలో విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత.. నా పేరును ఉపయోగించుకొని, వివాదాస్పద ప్రాపర్టీల్లో నా భాగస్వామ్యం ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు. నా పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడే యత్నాలు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది’  

‘కలెక్టర్ కు, పోలీసులకు నేను ఓ విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ ప్రాపర్టీ విషయంలోనూ నేను ఏ అధికారికి కూడా ఫోన్ చేసి పరిష్కరించాలని చెప్పిన దాఖలాలు లేవు.. భవిష్యత్తులో కూడా నేను చెప్పను. చట్టప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు. ప్రాపర్టీల వివాదాల విషయంలో నా జోక్యం ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’  

‘విశాఖలో ఏ ప్రాపర్టీ విషయంలోనూ అధికారులపై నేను ఒత్తిడి చేయలేదు. ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దు. నాకిక్కడ మూడు బెడ్ రూమ్ ల ఒక ఫ్లాట్ తప్ప ఎటువంటి ఆస్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా, నా పేరుతో గానీ, కుటుంబ సభ్యుల పేరుతో గానీ లేవు. ఆస్తులు సంపాదించుకోవాల్సిన అవసరం కూడా లేదు.. ఏ వివాదంలోనూ నేను తలదూర్చను’
 
‘ఏ వెంచర్ లోనూ భాగస్వామ్యంలో లేను. ఇటువంటివి పోలీసుల దృష్టికి వస్తే వెంటనే నా పేరు మీద అక్రమాలకు పాల్పడుతోన్న వారిని అదుపులోకి తీసుకోండి. నా పేరు చెబుతూ మీ దగ్గరకు వస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టండి. ఎందుకంటే వీటి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు’

‘గతంలో ఐదారేళ్లుగా ఇక్కడ ప్రాపర్టీ దందా జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నేనూ పోరాడాను… అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అదే పని చేస్తే ప్రజలు ఊరుకోరు’ అంటూ వరుస ట్విట్స్ చేశారు విజయసాయి.