రైతులకి ఎలా న్యాయం చేస్తారు ?

ఏపీ రాజధాని అమరావతి భవితవ్యం మరికొద్దిసేపట్లో తేలనుంది. ఈ ఉదయం 11గంటలకి ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినేట్ లో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఐతే, కేబినేట్ తీసుకోబోతున్న నిర్ణయాలు అప్పుడే బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం ఖాయమైందని వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలని బట్టీ అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలో అమరావతి రైతులకి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేయబోతుంది ? అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు, అమరావతిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కర్ప్యూ వాతావరణం తలపిస్తోంది. ఇదీగాక.. అమరావతి పేరు మారుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అమరావతి రైతులు మాత్రం ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. కావాలంటే.. పరిశ్రమలని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని చెబుతున్నారు. ఇక రాయలసీమ వాసులు తమ ప్రాంతంలో సెక్రెట్రీయేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మొత్తంగా.. ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో అమరావతి రైతులకి ఎలా న్యాయం చేస్తారు ? వారి ఆందోళనలని విరమించే ఏ రకమైన వరాలు కురిపిస్తారు ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఏపీ అసెంబీలో జగన్ చేసిన ప్రకటన ప్రకారం అమరావతిలోనే చట్టసభలు ఉండనున్నాయి. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఏర్పాటు కానుంది. ఇక కర్నూలులో హైకోర్టుని ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ క్యాబినేట్ నిర్ణయాలు కూడా దాదాపు ఇవే కానున్నాయని సమాచారమ్