జగ్గారెడ్డి డబ్బుల మాటలు
చాలా ఓపెన్ గా మాట్లాడే రాజకీయ నేతల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరు. ఎన్నికలు అనగానే డబ్బుతో ముడిపడిన వ్యవహారం. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు భారీగా డబ్బులు ఖర్చుపెడతారు. వారికంటే ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టేవారికే టికెట్లు తీసుకోవాలి. పోటీ చేసిన వారందరూ గెలవాలి. అప్పుడే నియోజవర్గంలో తన పరువు నిలబడుతుంది అంటున్నారు జగ్గారెడ్ది.
అదే సమయంలో తన దగ్గర డబ్బులు లేవు. ఎవరికీ తాను డబ్బు ఇవ్వలేను. డబ్బుల టెన్షన్ తనకు పెట్టొద్దని కోరారు జగ్గారెడ్డి. టీఆర్ఎస్ వారికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్న అభ్యర్థులకి ఆయన సూచించారు. కౌన్సిలర్ల టికెట్ల విషయంలో తాను జోక్యం చేసుకోబోనని.. పార్టీ ఎన్నికల ఇన్చార్జి, ఆయా వార్డుల నాయకులు, కార్యకర్తలు కలసి అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. తన భార్యకు కూడా తాను టికెట్ ఇవ్వనని… ఆమెకు ఇవ్వాలా, వద్దా అనేది కూడా మీరే నిర్ణయించాలని చెప్పారు. మొత్తానికి.. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టలేనని ముందే చేతులెత్తేశాడు జగ్గారెడ్డి.