మున్సిపల్ అఖిలపక్ష సమావేశంలో రసాభాస

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. టీఆర్ఎస్, ఎంఐఎం మినహా మిగతా పార్టీలన్నీ రిజర్వేషన్ల విధానంపై అసంతృప్తిని వ్యకం చేశాయి. కేవలం రెండ్రోజుల ముందు రిజర్వేషన్లు ప్రకటించడం ఏంటీ ? దాని వలన అభ్యర్థులని వెతుక్కోవడం కష్టమవుతుంది. అభ్యర్థులకి డబ్బులని సమకూర్చుకోవడం కూడా  కష్టమవుతుందని వాదించాయి.

రిజర్వేషన్లని ముందుగానే ప్రకటించడం లేదా ఎన్నికల షెడ్యూల్ ని రీ షెడ్యూల్ చేయడం అయినా చేయాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ అయితే ఏకంగా ఎన్నికల సంఘంతో వాగ్వాదానికి దిగింది. సమావేశం నుంచి వాకౌట్ చేసింది. కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి నిరంజన్ రావులు ఈసీతో వాదనకు దిగారు. తమ వాదనలని ఎన్నికల సంఘం వినిపించుకోవడం లేదని ఆరోపణ. ఈసీ అధికార పార్టీకితొత్తులా వ్యవహరిస్తుందన్న మర్రి శశిధర్ రెడ్ది ఆరోపించారు. 

మరోవైపు, కాంగ్రెస్ నేతల ఆరోపణలపై ఈసీ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంతో ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ఇది రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకొనే సమావేశం కానీ వాదనలకి దిగే సమావేశం కాదని నాగిరెడ్డి అన్నారు. ఇక దఌత బహుజన పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా స్వరూప్ హాజరయ్యారు. స్వరూప్ ని పోలీసులు బలవంతంగా బయటికి పంపించారు. దానిపై స్వరూప్ తీవ్రంగా స్పందించారు. తనకి అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందు కంటతడి పెట్టారు.

ఇక మున్సిపల్ ఎన్నికల సమయంలో మద్యాన్ని కంట్రోల్ చేయాలని బీజేపీ సూచించింది. టీడీపీ మాత్రం సంక్రాంతి పండగ సీజన్ లో ఎన్నికలు వద్దు. పండగ తర్వాత ఎన్నికలు వచ్చేలా రీ షెడ్యూల్ చేయాలని టీడీపీ ఈసీని కోరింది. మొత్తానికి.. తెరాస, ఎంఐఎం పార్టీలు తప్ప.. మిగితా పార్టీలన్నీ మున్సిపల్ ఎన్నికలని రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశాయి.