సరళా సాగర్‌ జలాశయానికి భారీ గండి.. వృథాగా పోతున్న నీరు !

సరళా సాగర్‌ జలాశయానికి భారీ గండి పడింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శంకరమ్మపేట వద్ద ఈ గండి పడింది. దీంతో జలాశయం కట్ట తెగి భారీగా నీరు వృథాగా పోతోంది. పదేళ్ల తర్వాత సరళాసాగర్‌ జలాశయానికి భారీగా నీరు చేరడంతో జలాశయం కట్ట ఒక్కసారిగా తెగిపోయింది. ఆసియాలోనే ఆటోమెటిక్‌ సైఫన్‌ సిస్టం కలిగిన తొలి జలాశయంగా సరళాసాగర్‌కు గుర్తింపు ఉంది. లీకేజీల కారణంగానే జలాశయానికి గండిపడిందని భావిస్తున్నారు. ఈ గండి కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. కానీ, నీరు వృథాగా పోతుండటంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.