తెలంగాణ-2020 నినాదం.. ‘ఈచ్ వన్ టీచ్ వన్’ !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ప్రతిన తీసుకోవాలని సీఎం కేసీఆర్  పిలుపునిచ్చారు. ‘ఈచ్ వన్ టీచ్ వన్’ అనే నినాదం అందుకుని ప్రతీ ఒక్క చదువుకున్న విద్యావంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యులుగా మార్చాలని సిఎం కోరారు. తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్ స్వీకరించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రం ఆవిర్భవించిన కేవలం 6యేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక విషయాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణం అన్నారు సిఎం. సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని ఆకాంక్షించారు. అనేక రకాల సంక్షేమ పథకాలతో నిరుపేదలకు జీవనభద్రత కల్పించుకోగలిగాం. పారిశ్రామిక, ఐటి రంగాల్లో దూసుకుపోతున్నాం. అదే విధమైన స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.