ఏపీ రాజధానిపై కిషన్ రెడ్డి కామెంట్స్

రాజధాని అంశం ఏపీ రాజకీయాలని హీటెక్కించిన సంగతి తెలిసిందే. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు దిశగా సీఎం జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. దాన్ని తెదేపా, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజధాని అంశంపై అన్నీ పార్టీల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఆ బేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 
ఏపీ భాజాపా నేతలు మూడు రాజధానుల అంశాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. జాతీయ నేతలు మాత్రం సీఎం జగన్ సర్కార్ నిర్ణయాన్ని కొంతమేర సపోర్టు చేస్తూనే క్లారీటీ అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై కేంద్రమంత్రి, తెలంగాణ భాజాపా కీలక నేత కిషన్ రెడ్డి స్పందించారు. ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలోనిది కాదని ఆయన స్పష్టం చేశారు. 

మూడు రాజధానుల అంశం, ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలిపిన తర్వాతే కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. ఇక తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుతామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.