మున్సిపోల్స్.. బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ !
మున్సిపల్ ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయ్. మున్సిపోల్స్ లో విజయం కోసం అన్నీ రాజకీయ పార్టీలు వ్యూహాలు రచించే పనిలో ఉన్నాయి. గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కిషన్‌రెడ్డితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. అధికార పార్టీ తెరాసని కిషన్ రెడ్డి పక్కన పెట్టడం విశేషం. అంతేకాదు.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఒక్కటేనని.. కాంగ్రెస్ నేతలు గెలిచినా టీఆర్‌ఎస్‌లోనే చేరుతారని కిషన్ రెడ్డి అన్నారు. అర్బన్ ఏరియాల్లో మజ్లిస్ బలంగా ఉందని ఆయన అంగీకరించారు. ఐతే.. టీఆర్‌ఎస్ ముసుగులో మజ్లిస్ నేతలు పోటీచేస్తారన్నారు. మొత్తానికి.. మున్సిపోల్స్ లో మజ్లిస్ ని ఢీకొనడమే భాజాపా టార్గెట్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది.