న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రచ్చ చేసిన నిర్మాత, అతని కుటుంబంపై పోలీస్ కేసు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్, అతని కుటుంబంపై పంజా గుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం.. వారి విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలపై ఈ కేసు నమోదైంది. డిసెంబరు 31న బేగంపేట కంట్రీక్లబ్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు దర్శకుడు రాంగోపాల్ వర్మను తీసుకొస్తామని హామీ ఇచ్చిన నిర్వాహకులు ఆయనను తీసుకురాలేదు. దీంతో.. ఇచ్చిన మాటను తప్పారంటూ ఈవెంట్ నిర్వాహకులతో నట్టి కుమార్ తనయుడు క్రాంతి కుమార్ ఘర్షణకు దిగారు.

ఈ గొడవ కాస్త పెద్దదైంది. క్రాంతి కుమార్ కారును అడ్డుకున్న నిర్వాహకులు, తాళాలు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. దీంతో తన కారు కనిపించడం లేదంటూ కంట్రీక్లబ్ వద్ద విధుల్లో ఉన్న ఎస్సై విజయ్ భాస్కర్ రెడ్డికి క్రాంతికుమార్ ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

ఇందుకు అంగీకరించని క్రాంతికుమార్ ఎస్సైతో వాదులాటకు దిగడంతో ఆయనను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చిన నట్టి కుమార్ అతని కుటుంబ సభ్యలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నటి కుమార్ విధుల్లో ఉన్న సిబ్బందిని చేత్తో నెట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు నటి కుమార్, అతని కుటుంబంపై కేసు పెట్టారు.