రాజకీయాలకి రాములమ్మ దూరమవుతారా ?

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కీలక పాత్రలో నటించారు. దాదాపు 13యేళ్ల తర్వాత ఆమె నటించిన చిత్రమిది. ఇందులో ఆమె ప్రొఫెసర్ భారతి పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా సరిలేరు ఈ వారమే (జనవరి11) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీ కావాలని విజయశాంతి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే, ఆమెని మెప్పించే పవర్ ఫుల్ పాత్ర కోసం వెయిట్ చేస్తోంది. సరిలేరు ఫలితం తర్వాత తన దగ్గరికి వచ్చిన కథలో ఓ బెస్ట్ కథని ఎంచుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే రాములమ్మ ఇకపై రాజకీయాలకి దూరమా ? అనే చర్చ మొదలైంది.

తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారకమిటీ చైర్మన్ గా వ్యవరించారు విజయశాంతి. ఆ తర్వాత మాత్రం మళ్లీ పార్టీ కార్యాలయం మెట్లు ఎక్కడం లేదు. అంతేకాదు.. ఆమెని పార్టీ పక్కకుపెట్టిందనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే ? కోర్ కమిటీ సమావేశానికి ఆమెకి ఆహ్వానం అందలేదు. అంతేకాదు.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం ఆమెకి పిలుపు రాలేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆమె రాజకీయాలకి దూరం కానున్నారా.. ? సినిమాలతో బిజీ అవుతారా ?? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు, విజయశాంతి బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఆహ్వానం కూడా అందింది. కానీ, పార్టీ మారే విషయంలో రాములమ్మ ఇప్పటికి ఇప్పుడే నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు సినిమాలు చేసి.. ఎన్నికలకి ముందు కాంగ్రెస్ లో తిరిగి యాక్టివ్ కావడమా ? లేక.. బీజేపీలో చేరడమా ? అప్పటి రాజకీయ పరిస్థితులని బట్టీ రాములమ్మ నిర్ణయం తీసుకోనున్నారని చెప్పుకొంటునారు.