రివ్యూ : సరిలేరు నీకెవ్వరు
చిత్రం : సరిలేరు నీకెవ్వరు (2020)
నటీనటులు : మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాతలు: అనిల్ సుంకర, మహేష్ బాబు, దిల్ రాజు
రిలీజ్ డేటు : జనవరి 11, 2020
రేటింగ్ : 3.5/5
పండగ పూట అభిమానులని మురిపించాలని సూపర్ స్టార్ మహేష్ బాబు డిసైడ్ అయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటించారు. ఆయనకి జోడీగా రష్మిక మందన నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. దాదాపు 13యేళ్ల తర్వాత ఆమె నటించిన చిత్రమిది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది ? అసలు.. సరిలేరు కథేంటీ ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
అజయ్ కృష్ణ (మహేష్ బాబు) ఆర్మీ మేజర్. కొందరు ఉగ్రవాదులు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేస్తారు. వారి చెర నుంచి విద్యార్థులను విడిపించేందుకు ప్రత్యేక ఆపరేషన్ కోసం రంగంలోకి దిగుతారు అజయ్ కృష్ణ. ఆ సమయంలో అజయ్ కృష్ణకు ఒక ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఆర్మీ నిబంధనలకు కట్టుబడి కర్నూలు బయలుదేరి వస్తాడు. వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేసే భారతి (విజయశాంతి)ని వెతుక్కుంటూ అజయ్ కృష్ణ కర్నూలుకు ఎందుకు రావాల్సి వచ్చింది? అజయ్ కర్నూలు వచ్చేసరికి భారతి ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు? ఆ పరిస్థితులకు కారణం ఎవరు? ఆమెను ఆ ఆపద నుంచి అజయ్ ఎలా రక్షించాడు? సంస్కృతి (రష్మిక) ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే ?
ఆర్మీ నేపథ్యంతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అనుకోని పరిస్థితుల్లో అజయ్ రైలులో కర్నూలు బయలుదేరతాడు. అప్పటివరకూ సీరియస్ గా సాగిన కథలోకి రష్మిక, సంగీత, రావు రమేష్ , బండ్ల గణేశ్ తదితర పాత్రలు ప్రవేశిస్తాయి. రైలులో జరిగే సన్నివేశాలన్నీ ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రథమార్ధం ప్రేక్షకుడిని కితకితలు పెట్టిస్తుంది.
ఐతే, సెకాంఢాఫ్ మాత్రం ఎమోషనల్ గా సాగింది. అజయ్, భారతి-నాగేంద్ర ప్రసాద్ మధ్య పోరు మొదలవుతుంది. మహేష్-విజయశాంతిల మధ్య సన్నివేశాలు ఆకట్టుకొంటాయ్. ఆర్మీ గురించి విజయశాంతి చెప్పే మాటలు అద్భుతంగా ఉన్నాయి. ఐతే, సెకాంఢాఫ్ సాగదీసినట్టు అనిపించింది. క్లైమాక్స్ భిన్నంగా చేశారు. కానీ, అది అద్భుతంగా ఏమీ లేదు.
ఎవరెలా చేశారు ?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటనకి వంకపెట్టలేం. ఆర్మీ అధికారిగా మహేశ్ లుక్, యాక్షన్ ఆయన అభిమానులను విశేషంగా అలరిస్తుంది. అదే సమయంలో ప్రొఫెసర్ భారతిని కాపాడే వ్యక్తిగా రెండు పాత్రల్లో వేరియేషన్స్ చూపించాడు. మహేష్ నుంచి అభిమానులు ఏం కోరుంటారో.. అన్నీ సరిలేరులో ఉంటాయ్. ఇక ప్రొఫెసర్ భారతి పాత్రలో విజయశాంతి. విజయశాంతి డైలాగ్ డెలివరీ, డిక్షన్ తెరపై చూస్తుంటే, పాత విజయశాంతి గుర్తుకు రాకమానదు.ప్రకాష్ రాజ్ కు సవాల్ విసిరే సన్నివేశాల్లో విజయశాంతి అదరగొట్టేశారు. ముఖ్యంగా ఆర్మీ గొప్పదనం గురించి మహేశ్ -విజయశాంతిల మధ్య వచ్చేసన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది.
రష్మిక మందన అల్లరి పిల్లగా కనిపించింది. మహేశ్ బాబును ప్రేమించే అమ్మాయిగా ఆమె నటన అలరిస్తుంది. ముఖ్యంగా రైలులో వచ్చే సన్నివేశాల్లో నవ్వుల పువ్వులు పూయిస్తుంది. ప్రకాష్ రాజ్ మరోసారి ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. మంత్రి నాగేంద్ర ప్రసాద్ గా ఆయన నటన బాగుంది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, రఘుబాబు, బండ్ల గణేశ్, సంగీత, హరితేజలు నవ్వులు పంచే ప్రయత్నం చేశారు.
సాంకేతికంగా :
సరిలేరు చాలా వేగంగా తెరకెక్కింది. కేవలం ఐదు నెలల్లోనే పూర్తయింది. మహేష్ సినిమాల్లోనే వేగంగా తెరకెక్కిన సినిమా ఇది. అలాగని క్వాలిటీలో ఎక్కడా రాజీపడలేదు. సినిమా చాలా రిచ్ గా వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సెకాంఢాఫ్ లో సినిమా నెమ్మదిగా సాగింది. దాదాపు 3గంటల సినిమా ఇది. ఇంకాస్త రన్ టైం తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
* మహేష్, విజయశాంతి
* కామెడీ
* యాక్షన్
* నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
* సెకాంఢాఫ్
* క్లైమాక్స్
రేటింగ్ : 3.5/5