రివ్యూ : అల.. వైకుంఠపురంలో

చిత్రం : అల.. వైకుంఠపురంలో (2020)

నటీనటులు : అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, నివేదా పేతురాజు, మురళీ శర్మ, బ్రహ్మానందం, సునీల్, సుశాంత్, నవదీప్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు

సంగీతం : థమన్

దర్శకత్వం : త్రివిక్రమ్

నిర్మాత : హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్

రిలీజ్ డేటు : జనవరి 12, 2020.

రేటింగ్ : 3.75/5

ఓ సరదా సినిమా చేయాలన్న ఆలోచన అల్లు అర్జున్, త్రివిక్రమ్ లని మరోసారి కలిపింది. ‘నా పేరు సూర్య’ తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  చేయాలని బన్నీ భావించారు. అందుకే గ్యాప్ తీసుకొన్నారు. ఇక ‘అరవింద సమేత’ లాంటి సీరియస్ సినిమా తర్వాత త్రివిక్రమ్ తన పాత స్టయిల్ కి రావాలని.. ఓ సరదా సినిమా చేయాలని భావించారు. ఈ కామన్ సరదా ఆలోచన బన్నీ-త్రివిక్రమ్ లని మరోసారి కలిపింది. అల.. వైకుంఠపురంలో సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా అల.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. గ్యాప్ తీసుకున్నా పర్లేదు.. బన్నీ అభిమానులని పూర్తిస్థాయిలో అలరించాడా?. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ మరోసారి వర్కవుట్ అయిందా ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :
‘స్థానం మారినా.. స్థాయి మారదు’ ఇదే అల.. కథ. రామచంద్ర (జయరాం) ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు వాల్మీకి(మురళీశర్మ). ఇద్దరికీ ఒకేసారి ఆస్పత్రిలో పిల్లలు పుడతారు. అయితే రామచంద్ర బిడ్డ పురిటిలోనే చనిపోయాడని భావించి వాల్మీకి తనకు పుట్టిన కొడుకును తన యజమానికి ఇచ్చేస్తాడు. ఒక నర్సు సాయంతో బిడ్డలను మార్చేస్తారు. బిడ్డ చనిపోయాడనుకుని తీసుకెళ్తుండగా.. ఆ బిడ్డ బతుకుతాడు. ఆ విషయం యజమానికి చెప్పకుండా.. యజమాని కొడుకును తీసుకెళ్లి బంటు(అల్లు అర్జున్)అని పేరు పెట్టి పెంచుకుంటాడు. ఒక మధ్యతరగతి వ్యక్తిలా అతడిని పెంచుతాడు.

మరోవైపు వాల్మీకి కొడుకు రాజ్ మనోహర్ (సుశాంత్ )గా రామచంద్ర దగ్గర పెరిగి పెద్దవాడవుతాడు. మరి అసలు నిజం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? తెలిసిన తర్వాత బంటు ఏం చేశాడు? చివరకు అసలు తల్లిదండ్రులను కలుసుకున్నాడా? మధ్యలో అమూల్య(పూజాహెగ్డే)ఎలా పరిచయం అయింది? అప్పలనాయుడు(సముద్రఖని) ఎవరు? అతడిని బంటు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది పూర్తి కథ.

ప్లస్ పాయింట్స్ :

* అల్లు అర్జున్, మురళీ శర్మ

* వినోదం

* యాక్షన్

*నేపథ్య సంగీతం

* పాటలు

మైనస్ పాయింట్స్ :

* ద్వితీయార్థంలో కాస్త సాగదీత

ఎలా ఉందంటే ?

ధనవంతుడి పిల్లవాడు పేదవాడి ఇంటికి, పేదవాడి పిల్లవాడు ధనవంతుడి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది ? అనే నేపథ్యాన్ని కథగా రాసుకొన్నాడు త్రివిక్రమ్. దాన్ని తనదైన స్టయిల్ లో ఎంటర్ టైనింగ్ చెప్పాడు. తొలిభాగంలో అల్లు అర్జున్ మురళీ శర్మ ఇంట్లో పెరిగే వాతావరణాన్ని చూపించాడు. ఆ సన్నివేశాలు ఫుల్లుగా నవ్విస్తాయి. మిడిల్ క్లాస్ అబ్బాయిగా బన్నీ నటన హైలైట్.

ఇక సెకాంఢాఫ్ లో కథనం సీరియస్ నెస్ సాగుతూనే మరోవైపు నవ్వులు పంచేలా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ కామెడీ టైమింగ్ అలరిస్తుంది. బోర్డ్ మీటింగ్  సమావేశం సందర్భంగా అల్లు అర్జున్ చేసే యాక్టింగ్ అదిరిపోయింది. నాన్ స్టాప్ నవ్వులు. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం బలంగా, బాగుంది. ప్రీ క్లైమాక్స్ అదిరిపోయింది. క్లైమాక్స్ ట్విస్ట్ కి సలాం కొట్టాల్సిందే.

ఎవరెలా చేశారంటే ?

అల్లు అర్జున్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. త్రివిక్రమ్ మార్కు కామెడీని బన్నీ ఫర్ ఫెక్ట్ గా పండించాడు. మధ్య తరగతి యువకుడిగానూ, అల వైకుంఠపురములోకి వెళ్లిన తర్వాత ప్రతి ఫ్రేమ్ లోనూ అల్లు అర్జున్ స్టైల్ గా కనిపించారు. ఇక బన్ని డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరగదీశాడు. ప్రతి ఒక్క యాక్షన్ సీన్ కి ఓ కాన్సెప్ట్ తీసుకొని చేసారు. మాస్, క్లాస్ ఆడియెన్స్ ని అవి ఆకట్టుకుంటాయి. బన్నీ తర్వాత మురళీ శర్మ పాత్ర గురించి చెప్పుకోవాలి. మధ్య తరగతి తండ్రిగా, ప్రత్యేకమైన మేనరిజంతో మురళీ శర్మ నటన బాగుంది. సముద్రఖిని, టబు, సుశాంత్, నవదీప్, సునీల్, బ్రహ్మానందం.. ఇలా అందరు తమ తమ పరిథి మేరకు నటించారు.

సాంకేతికంగా : 

అల.. పాటలు సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. నేపథ్య సంగీతంలోనూ థమన్ తనదైన మార్క్ చూపించారు. సినిమా స్థాయిని పెంచే నేపథ్య సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీ ఫ్రేమ్ రిచ్ గా ఉంది. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ బాగా పేలాయ్. ద్వితీయార్థం కాస్త సాగదీత అనిపించినా… ఎక్కడా బోర్ కొట్టడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : అల.. హాయిగా సాగిపోయిందంతే.. !

రేటింగ్ : 3.75/5