నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్
ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలను ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాలని ఆదేశిస్తూ ఢిల్లీ కోర్టు ఇటీవల డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆలోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ ఇద్దరు దోషులు గతవారం తమకున్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశమైన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ సుప్రీం కొట్టేసింది. వి.రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం పిటిషన్లను ఏకగ్రీవంగా తోసిపుచ్చింది. పిటిషన్ల వాదనకు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. దీంతో ఈనెల 22న ఉదయం 7 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు.