పొత్తు కుదిరినా.. స్టాండ్ మారలేదు !


ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని జనసేన పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెళ్లి రాజధాని రైతుల పోరాటంలో పాలు పంచుకున్నాడు. మరోవైపు, రాజధాని విషయంలో బీజేపీలో ధ్వంద్వ వైఖరి వినిపించింది. మూడు రాజధానుల అంశాన్ని ఆ పార్టీ అధిష్టానం మద్దతు తెలుపుతున్నట్టు, స్థానిక బీజేపీ నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు కనిపించింది. ఐతే, ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారాయి.

బీజేపీ, జనసేన ఒకే గొడుగు కిందికి చేరాయి. స్థానిక సంస్థల నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి పని చేస్తామని, ప్రజా సమస్యలపై పోరాడుతామని, 2024లో విజయం విజయం మాదేనని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో పవన్ కల్యాణ్ స్టాండ్ ఏమైనా మారుతుందా ? అనే అనుమానాలు కలిగాయి. కానీ, బీజేపీతో పొత్తు కుదిరినా.. పవన్ స్టాండ్ మాత్రం మారలేదు.

సీఎం జగన్‌ స్వప్రయోజనాల కోసం చేయతలపెట్టిన రాజధాని మార్పును తామెవరూ ఆమోదించేది లేదని పవన్‌  తేల్చిచెప్పారు. అమరావతి రైతుల సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమకు అధికార వికేంద్రీకరణ అవసరంలేదని.. అభివృద్ధి వికేంద్రీకరణకు డిమాండ్‌ చేశారు. అమరావతి రైతుల నోట మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అమరావతి రైతుల రక్షణ కోసం ఉద్యమానికి సంసిద్దత ప్రకటించారు.