టీమిండియా ధాటికి జపాన్ విలవిల
సౌతాఫ్రికాలో వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ లో యువ భారత్ జట్టు అదరగొడుతోంది. రెండో లీగ్ మ్యాచ్ లో జపాన్ పై ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన యువ భారత జట్టు.. జపాన్ కి బ్యాటింగ్ అప్పగించింది. భారత బౌలింగ్ ధాటికి జపాన్ జట్టు కేవలం 41 పరుగులకే కుప్పకూలింది. జపాన్ జట్టులో ఐదుగురు డకౌట్. ఏ ఒక్కరూ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. భారత్ బౌలర్లు రవి బిష్ణోయ్(4/5), కార్తిక్ త్యాగీ(3/10), ఆకాశ్ సింగ్(2/11) అద్భుతంగా బౌలింగ్ చేశారు.
అనంతరం 42 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా చేధించింది. భారత యువ సంచలనం యశస్వీ జైశ్వాల్ 18 బంతులలో 29 పరుగులు, మరో ఓపెనర్ కుమార్ 11 బంతుల్లో 13 పరుగులుు చేసి విజయ లాంచనాన్ని పూర్తి చేశారు. వరల్డ్ కప్ లో యువ భారత జట్టుకి ఇది రెండో విజయం. తొలి మ్యాచ్ లో శ్రీలంకపై టీమిండియా గెలుపొందిన సంగతి తెలిసిందే.